దేశానికి ఎందరో నాణ్యమైన ఆటగాళ్లను అందించిన హైదరాబాద్ క్రికెట్ సంఘం నుంచి ఒక్క ప్లేయర్ కూడా ఐపీఎల్‌కు ఎంపిక కాకపోవడంపై అజారుద్దీన్ ఆవేదనను పరిశీలిస్తే ఇందులో ఫ్రాంచైజీల తప్పిదాల కంటే స్వీయ పొరపాట్లే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో హైదరాబాద్ ఆటగాళ్ల నుంచి.. ఐపీఎల్ జట్ల దృష్టిలో పడేంతటి ప్రదర్శన ఒక్కటంటే ఒక్కటి కూడా నమోదు కాలేదు. దీనికి యువ ఆటగాళ్లలో సత్తా లేదనేకంటే.. ప్రతిభ గల ప్లేయర్లకు సరైన అవకాశాలు దక్కడం లేదనడమే సమంజసం. ముస్తాక్ అలీ ట్రోఫీనే తీసుకుంటే.. మిగిలిన రాష్ర్టాల జట్లు వేదిక వద్దకు చేరుకునే వరకు మనవాళ్లు జట్టునే ఎంపిక చేయలేదు. హెచ్‌సీఏ అధ్యక్షుడు ఒక సెలెక్షన్ కమిటీని ఎంపిక చేస్తే.. కార్యదర్శి మరో కమిటీకి ఓకే చెప్పడం. ఒక్క రోజు వ్యవధిలో ఇద్దరు కోచ్‌లను మార్చడం. మంచి ప్లేయర్లను పక్కనపెట్టి.. సిఫారసు ఉన్న వాళ్లకు అవకాశాలు ఇవ్వడం.. ఇలా కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు హెచ్‌సీఏ దుస్థితికి సవాలక్ష కారణాలు. మూడు ప్రపంచకప్‌లలో దేశానికి నాయకత్వం వహించిన అజారుద్దీన్ హెచ్‌సీఏ పగ్గాలు చేపట్టాక కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఇతర రాష్ర్టాలకు చెందిన ఆటగాళ్లు ఐపీఎల్ వేలంలో కోట్లకు కోట్లు కొల్లగొడుతుంటే.. మనవాళ్లు కనీస ధరకు కూడా అమ్ముడవడం లేదు.
సన్‌రైజర్స్ కూడా అదే బాటలో..
లోకల్ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా పెద్దగా ఆసక్తి కనబర్చలేదనేది వాస్తవం. జట్టు పేరులో హైదరాబాద్ ఉన్నా.. ఇక్కడి నుంచి ఒక్క ఆటగాడి ప్రాతినిధ్యం లేకపోవడం ఆశ్చర్యం కలిగించక మానదు. గత సీజన్లో భావనక సందీప్‌ను కొనుగోలు చేసుకున్న రైజర్స్ ఈసారి వేలంలో అతడిని కూడా వదిలేసుకుంది. తమిళనాడుకు చెందిన కళానిధి మారన్ (సన్‌రైజర్స్ యజమాని)కు స్థానిక ఆటగాళ్లపై పెద్దగా అవగాహన లేకున్నా.. జట్టు మెంటార్‌గా కొనసాగుతున్న వీవీఎస్ లక్ష్మణ్ అయినా ఈ విషయంలో చొరవ చూపకపోవడం ఆశ్చర్యకరం. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను ముంబై కనీస ధరకు కొనుగోలు చేసుకున్నట్లు.. యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటే అంతర్జాతీయ ఆటగాళ్ల సహవాసంలో కనీసం అనుభవమైన గడించేవాళ్లు.
వలసపోతున్న ప్రతిభావంతులు..
కొత్త ఆటగాళ్లను వెలుగులోకి తేవడంలో విఫలమవుతున్న హెచ్‌సీఏ.. ఇప్పటికే పేరు సంపాదించిన ఆటగాళ్లను నిలుపుకోవడంలోనూ అదే బాటలో నడుస్తున్నది. అందుకే అంబటి రాయుడు ఆంధ్రకు మారిపోగా, రవికిరణ్ చత్తీస్‌గఢ్‌కు వెళ్లిపోయాడు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో హెచ్‌సీఏ తరఫున ఆడేందుకు ప్రతిభగల ఆటగాళ్లు ముందుకు రావడం కష్టమే. ఇప్పటికైనా హెచ్‌సీఏలో వేళ్లూనుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేసి తిరిగి ఆటకు పట్టం కట్టాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
సిరాజ్ విషయంలోనూ..
ఆస్ట్రేలియా గడ్డపై అద్వితీయ ప్రదర్శన కనబర్చిన పేసర్ మహమ్మద్ సిరాజ్ విషయంలోనూ హెచ్‌సీఏ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తండ్రి కడచూపునకు కూడా నోచుకోకుండా.. కఠిన పరిస్థితుల్లో ఆసీస్ గడ్డపై సిరాజ్ మెరుపులు మెరిపించి స్వదేశానికి తిరిగి వస్తే.. కనీసం మర్యాదపూర్వక సన్మానం నిర్వహించకపోవడం హెచ్‌సీఏ వైఖరిలోని డొల్లతనాన్ని స్పష్టంచేస్తున్నది. వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లను పట్టించుకోకపోయినా.. ఇప్పుడిప్పుడే క్రికెట్ వైపు అడుగులు వేస్తూ.. భవిష్యత్తుకు బాటలు వేసు కోవాలనుకుంటున్న ప్లేయర్లకైతే హెచ్‌సీఏ తీరు శరాఘాతంగా మారింది.
టీఎన్‌పీఎల్‌తో వెలుగులోకి..
తాజా వేలంలో భారీ ధర పలికిన ఆల్‌రౌండర్ షారుక్ ఖాన్ వెలుగులోకి రావడానికి ప్రధాన కారణం తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్). అంతకుముందు తంగరసు నటరాజన్, వరుణ్ చక్రవర్తి కూడా టీఎన్‌పీఎల్ ద్వారానే తమ ప్రతిభ చాటుకున్నారు. మట్టిముద్దల్లాంటి ఆటగాళ్లను మెరికల్లా తీర్చిదిద్దాల్సిన హెచ్‌సీఏ.. అవినీతి ఆరోపణలు, అంతర్గత కుమ్ములాటలు, లాబీయింగ్లతోనే కాలక్షేపం చేస్తున్నది. పక్క రాష్ర్టాలన్ని యువ ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చేందుకు లీగ్‌లు నిర్వహిస్తుంటే.. మనవాళ్లు మాత్రం రంజీట్రోఫీ, విజయ్ హజారే, ముస్తాక్ అలీ వంటి పెద్ద టోర్నీల్లో పాల్గొనే జట్ల విషయంలోనే తర్జన భర్జన పడుతున్నారు. ఇక హెచ్‌సీఏ వన్డే, టూడే లీగ్‌ల్లో డబ్బున్న వాళ్లదే రాజ్యంగా మారిందనే వాదనలు ఎక్కువయ్యాయి.