వాషింగ్టన్, ఫిబ్రవరి 19: అమెరికా వలస విధానంలో సమూల మార్పులు చేస్తూ బైడెన్ ప్రభుత్వం నూతన వలస బిల్లును తీసుకొచ్చింది. గురువారం దీనిని ఆ దేశ కాంగ్రెస్‌లో (చట్టసభలో) ప్రవేశపెట్టింది. ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల జారీలో దేశాల వారీ కోటాను ఎత్తివేయడం సహా పలు కీలక ప్రతిపాదనలను బిల్లులో పొందుపరిచారు. అమెరికాలో నివాసముంటున్న వేలాది మంది భారతీయ వృత్తి నిపుణులు, వారి కుటుంబ సభ్యులకు ఈ బిల్లుతో ప్రయోజనం చేకూరనున్నది. యూఎస్ సిటిజన్‌షిప్ యాక్ట్-2021 పేరుతో ఈ బిల్లును తీసుకొచ్చారు.
సెనేట్‌లో గట్టెక్కేనా..
‘అమెరికా ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి వలస ప్రజలు ఎంతో కృషిచేస్తున్నారు. వ్యాపార సంస్థలు నెలకొల్పి, పన్నులు చెల్లిస్తూ, మన పిల్లలకు బోధిస్తూ ఎంతో సేవ చేస్తున్నారు. వారు మన సహచర ఉద్యోగులు. స్నేహితులు’అని సాంచెజ్ పేర్కొన్నారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే రెండు సభలలోనూ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రతినిధుల సభలోనూ, సెనేట్‌లోనూ డెమోక్రాట్లకు ఆధిపత్యం ఉన్నది. అయినప్పటికీ ఎగువ సభలో (సెనేట్) బిల్లు ఆమోదం పొందాలంటే 10 మంది రిపబ్లికన్ల మద్దతు అవసరం. లక్షలాది మంది వలస ప్రజల ప్రయోజనాల దృష్ట్యా తగినంత మంది రిపబ్లికన్ల మద్దతు లభిస్తుందని డెమోక్రాట్లు భావిస్తున్నారు.
బిల్లులోని ముఖ్యాంశాలు..
దేశంలో అనుమతి లేకుండా నివాసముంటున్న 1.1 కోట్ల మందికి దేశ పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.
అమెరికాలో చట్టబద్ధ శాశ్వత నివాసానికి అవసరమైన గ్రీన్‌కార్డుల కోసం పదేండ్లకు పైగా ఎదురుచూస్తున్న వారికి తక్షణమే వాటిని జారీచేయనున్నారు. ప్రస్తుతం గ్రీన్‌కార్డుల కోసం అమెరికాలోని భారతీయులు దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్నారు. తాజా బిల్లుతో వారికి ఎంతో ఊరట లభించనున్నది.
హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి లభిస్తుంది.
అమెరికాలోని యూనివర్సిటీల్లో స్టెమ్ కోర్సులను (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) పూర్తిచేసిన వారు కోర్సు తర్వాత అమెరికాలోనే ఉండేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.
తక్కువ వేతనం కలిగిన ఉద్యోగులు కూడా గ్రీన్‌కార్డులు పొందడం సులభతరం కానున్నది.
వలస ప్రజలు తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు నిబంధనలను సరళీకృతం చేశారు.