మెల్బోర్న్: ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ ఆష్లే బార్టీకి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఊహించని పరాజయం ఎదురైంది. 1978 (క్రిస్ ఓనీల్) తర్వాత.. సొంతగడ్డపై గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించిన తొలి ఆస్ట్రేలియా ప్లేయర్‌గా నిలువాలనుకున్న ఆమె ఆశ తీరలేదు. బుధవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో బార్టీ 6-1, 3-6, 2-6 తేడాతో 25వ ర్యాంకర్ కరోలినా ముచోవా (చెక్‌రిపబ్లిక్) చేతిలో పరాజయం పాలైంది. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరడం ముచోవాకు ఇదే తొలిసారి. తొలి సెట్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆష్లే ఓ దశలో 5-0తో నిలిచి సొంతం చేసుకుంది. ఆ తర్వాత కాస్త ఇబ్బందిగా అనిపించడంతో 10 నిమిషాల పాటు మెడికల్ టైమ్ ఔట్ తీసుకుంది. మొత్తం 37 తప్పిదాలు చేయడం సహా చివరి రెండు సెట్లలో నాలుగుసార్లు సర్వీస్‌ను కోల్పోయి చివరికి బార్టీ పరాజయం పాలైంది. అమెరికన్ల మధ్య జరిగిన మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీ 4-6, 6-2, 6-1 తేడాతో అన్‌సీడెడ్ జెసికా పెగులపై విజయం సాధించింది. గ్రాండ్‌స్లామ్ సెమీస్ చేరడం బ్రాడీకి కూడా తొలిసారి కాగా.. ముచోవాతో తలపడనుంది.
అదరగొట్టి.. తడబడి
పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ రఫేల్ నాదల్కు భారీ షాక్ తగిలింది. తొలి రెండు సెట్లు సునాయాసంగా కైవసం చేసుకున్న రఫా ఆ తర్వాత స్టెఫనోస్ సిట్సిపాస్ (గ్రీసు)పై దూకుడు కొనసాగించలేకపోయాడు. దీంతో నాదల్ 6-3, 6-2, 7-6(4/7), 4-6, 5-7 తేడాతో ఐదో సీడ్ సిట్సిపాస్ చేతిలో ఓడాడు. సుదీర్ఘ కెరీర్లో.. తొలి రెండు సెట్లు గెలిచాక మ్యాచ్ ఓడిపోవడం నాదల్కు ఇది కేవలం రెండోసారే. మొత్తం 4 గంటల 5 నిమిషాల పాటు మ్యాచ్ జరుగగా.. సిట్సిపాస్ 17 ఏస్‌లు, 49 విన్నర్లు సాధిస్తే.. నాదల్ 15 ఏస్‌లు, 58 విన్నర్లు బాదాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు(20) సాధించిన ఆటగాడిగా స్విస్ దిగ్గజం ఫెదరర్‌తో సమానంగా ఉన్న నాదల్ మరొక్కటి సాధించి చరిత్ర సృష్టించాలన్న పట్టుదలకు ప్రస్తుతం బ్రేక్ పడింది. మరో క్వార్టర్స్‌లో నాలుగో ర్యాంకర్ డానిల్ మద్వెదెవ్ 7-5, 6-3, 6-2 తేడాతో తన దేశానికి చెందిన ఆరో సీడ్ అండ్రీ రుబ్లేవ్‌పై అలవోకగా గెలిచాడు. సెమీస్‌లో శుక్రవారం సిట్సిపాస్, మద్వెదెవ్ తలపడనున్నారు. టాప్ సీడ్ జొకోవిచ్, తొలిగ్రాండ్స్లామ్లోసెమీస్ చేరిన అస్లాన్ కరత్సెవ్ మధ్య గురువారం మ్యాచ్ జరుగనుంది.