Municipal Elections Schedule: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఎన్నికల నగారా మోగింది. ఓవైపు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగానే.. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ను ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియను.. అక్కడి నుంచే కొనసాగించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా.. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను కొనసాగించనున్నట్లు ఈసీ తెలిపింది. మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించింది. అదే రోజున మధ్యాహ్నం 3 గంటల తరువాత బరిలో నిలిచిన అభ్యర్థుల పేర్లను ఈసీ ప్రకటించనుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపల్ కార్పొరేషన్లకు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు మార్చి 10వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ పోలింగ్ ప్రక్రియ 10వ తేదీన ఉదయం 7 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. కాగా, సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లలో నిల్చున్న ఓటర్లకు ఓటు వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. పోలింగ్ అనంతరం మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. అయితే, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దరిమిలా రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నిబంధనలను ఎవరూ అతిక్రమించకూడదని ఈసీ స్పష్టం చేసింది.
ఇదిలాఉండగా, 2020 మార్చి 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికల నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2020, మార్చి 14 వ తేదీ వరకు నామినేషన్లు కూడా స్వీకరించారు. 15వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించిన ఈసీ.. అదే రోజు మధ్యాహ్నం.. ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వ్యాప్తి కారణంగా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నామని, తిరిగి దీనిపై మరో ప్రకటన వచ్చేంత వరకు ఎన్నికల ప్రక్రియ నిలిపివేయబడుతుందని ఈసీ ప్రకటించింది.