హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్టార్టప్ కంపెనీ ప్యూర్ ఈవీ తన తొలి ఎలక్ట్రికల్ బైక్‌ను సిద్ధం చేసింది. ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి అభివృద్ధి చేసిన ఈ బైక్‌కు ‘ఎట్రిస్ట్ 350’గా నామకరణం చేసింది. ఈ ఏడాది ఆగస్టు 15న దీన్ని మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. తొలుత దీన్ని హైదరాబాద్, బెంగళూరు, పుణెలో అందుబాటులోకి తీసుకొస్తామని, ఆ తర్వాత మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తామని వెల్లడించింది. పూర్తిగా హైదరాబాద్‌లోని కంపెనీ టెక్నికల్, మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్లో అభివృద్ధి చేసిన ఎట్రిస్ట్ 350 బైక్.. 3.5 కిలోవాట్ల పేటెంటెడ్ బ్యాటరీతో పనిచేస్తుందని తెలిపింది. గంటకు 85 కి.మీ. గరిష్ఠ వేగంతో ప్రయాణించగలిగే ఈ బైక్.. సింగిల్ చార్జింగ్‌తో 120 కి.మీ. మైలేజీ ఇస్తుందని గురువారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ బైక్‌లలో ఇదే అత్యధికం కావడం విశేషం. ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఎట్రిస్ట్ 350 బైక్‌కు ఐదేండ్ల వారంటీ ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.
బ్యాటరీ ప్రత్యేకత
ఎలక్ట్రికల్ వాహనాల్లో ప్రధాన పాత్ర పోషించేది బ్యాటరీనే. ఇలాంటి వాహనాల్లో ఇప్పటివరకు లెడ్ యాసిడ్ బ్యాటరీలను మాత్రమే వాటిని 6గంటల పాటు చార్జ్ చేస్తే సుమారు 90 కి.మీ. దూరం వరకు ప్రయాణిస్తాయి. కానీ ప్యూర్ ఈవీ వాహనాల్లో లిథియం అయాన్ బ్యాటరీలను వినియోగిస్తున్నారు. వీటిని కేవలం 4 గంటలు చార్జింగ్ చేస్తే 80 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. ఏవైనా సమస్యలు ఏర్పడితే మరమ్మతు చేసుకునే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కలిగి ఉండటం ఈ బ్యాటరీ ప్రత్యేకత. దీంతో బ్యాటరీకి సంబంధించిన మరమ్మతుల కోసం బైక్‌ను మెకానిక్ షెడ్డుకు తీసుకెళ్లాల్సిన అవసరమే ఉండదు.
సామాన్య వాహనదారులే లక్ష్యం..
సామాన్య వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ఎట్రిస్ట్ 350 బైక్‌ను రూపొందించాం. టెస్ట్ డ్రైవ్ కోసం డెమో ఈవీలను సిద్ధం చేశాం. ఇవి కచ్చితంగా వాహనదారుల ఆదరణ పొందుతాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న విద్యుత్ వాహనాలకు మా బైక్ గట్టి పోటీ ఇస్తుందని నమ్ముతున్నాం. ప్రస్తుతం కొన్ని నగరాల్లోనే ఎట్రిస్ట్ 350 బైక్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నప్పటికీ త్వరలోనే దేశవ్యాప్తంగా వీటిని విస్తరిస్తాం.
- నిషాంత్ డొంగరి, ప్యూర్ ఈవీ ఫౌండర్, ఐఐటీ హెచ్ అసోసియెట్ ప్రొఫెసర్