న్యూఢిల్లీ : భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వాహనంపై జాగ్వర్ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది మార్చి 9 నుంచి భారత్‌లో జాగ్వర్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అమ్మకాలు ప్రారంభమవుతాయని ఆటో దిగ్గజం వెల్లడించింది. కస్టమర్లు, మీడియాను ఉద్దేశించి వర్చువల్ సమావేశం ద్వారా ఈ వాహనాన్ని జాగ్వర్ లాంఛ్ చేయనుంది. ఐ-పేస్ బ్రాండ్ ఈ ఏడాది తొలి లాంఛ్‌తో పాటు భారత్‌లో జాగ్వర్ తొలి ఎలక్ట్రిక్ వాహనం కూడా ఇదే కావడం గమనార్హం. ఈ ఎలక్ట్రిక్ వాహనం ఎస్, ఎస్ఈ, హెచ్ఎస్ఈ వంటి మూడు లెవెల్స్‌లో అందుబాటులో ఉంది.
జాగ్వర్ ఐ-పేస్ వాహనం వరల్డ్ కార్ ఆఫ్ ద ఇయర్, వరల్డ్ కార్ డిజైన్ ఆఫ్ ది ఇయర్, వరల్డ్ గ్రీన్ కార్ ఆఫ్ ద ఇయర్ 2019 వంటి ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. ల్యాండ్‌రోవర్ డిఫెండర్ డిజిటల్ లాంఛ్‌కు అద్భుత స్పందన వచ్చిన అనంతరం జాగ్వర్ ఐ-పేస్‌ను ఇండియాలో లాంఛ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని వినూత్న టెక్నాలజీతో ఈ వాహనం కస్టమర్ల ముందుకు తీసుకువస్తున్నామని జాగ్వర్ ల్యాండ్‌రోవర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రోహిత్ సూరి పేర్కొన్నారు.