న్యూఢిల్లీ: ఓలా, ఉబర్ లాంటి క్యాబ్ ఆపరేటర్లను నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం క్యాబ్ ఆపరేటర్లు డిమాండ్ అధికంగా ఉన్న సమయాల్లో చార్జీని 1.5 రెట్లకు మించి పెంచకూడదు. కనీస చార్జీలో ప్రయాణికులకు 50 శాతానికి మించి డిస్కౌంట్ ఇవ్వకూడదు. అంతేకాకుండా చార్జీలో 20 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని కమీషన్‌గా చార్జి చేయకూడదు. క్యాబ్ డ్రైవర్లు లేదా ప్రయాణికులు సరైన కారణాన్ని చూపకుండా రైడ్‌ను క్యాన్సిల్ చేస్తే ప్రయాణ చార్జీలో 10 శాతం మొత్తాన్ని లేదా గరిష్ఠంగా 100 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.