కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. ఢిల్లీలో ప్రధాని మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సమావేశమయ్యారు. మహారాష్ట్ర రైతుల సమస్యలపై మాట్లాడేందుకే వెళ్లానని ఆ సందర్భంలో ఆయన చెప్పారు. ఐతే పైకి రైతుల కోసం అని చెప్పినప్పటికీ.. మహారాష్ట్ర రాజకీయాలపైనే చర్చించారని ప్రచారం జరిగింది. అసలు వారిద్దరి భేటీలో ఏం చర్చించరాని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆ వివరాలను శరద్ పవార్ సోమవారం బయటపెట్టారు. ఇద్దరం కలిసి పనిచేద్దామని ప్రధాని మోదీ తనతో అన్నారని.. ఐతే ఆ ప్రతిపాదనను తాను సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పారు. సుప్రియా సూలేకు కేంద్రమంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేసినప్పటికీ ఒప్పుకోలేదని స్పష్టం చేశారు.
ఇద్దరం కలిసి పనిచేద్దామని మోదీ ప్రతిపాదించారు. ప్రస్తుతం మన ఇద్దరి వ్యక్తిగత సంబంధాలు బాగానే ఉన్నాయని, అవి అలాగే ఉండాలని నేను చెప్పా. మనం కలిసి పనిచేయడం సాధ్యమయ్యే పని కాదని చెప్పా.
— శరద్ పవార్
తనకు రాష్ట్రపతి పదవిని బీజేపీ ఆఫర్ చేసిందన్న ప్రచారాన్ని శరద్ పవార్ ఖండించారు. ఐతే తన కూతురు సుప్రియా సూలేకు మాత్రం కేంద్ర పదవిని ఇస్తామన్నారని తెలిపారు. సుప్రియా సూలే పుణె జిల్లాలోని బారామతి నుంచి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. కాగా, శరద్ పవార్‌పై మోదీ పలు మార్లు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొన్న సమయంలోనూ పార్లమెంట్ వేదికగా ఎన్సీపీని పొగిడారు మోదీ. బీజేపీతో సహా మిగిలిన పార్టీలు కూడా ఎన్సీపీ క్రమశిక్షణను చూసి నేర్చుకోవాల రాజ్యసభ 250 సమావేశాల సందర్భంగా వ్యాఖ్యానించారు మోదీ. 2016లో పవార్ ఆహ్వానం మేరకు పుణెలోని వంసత్ దాదా షుగర్ ఇన్స్టిట్యూట్కు వెళ్లారు మోదీ. ఆ సందర్భంలోనూ శరద్ పవార్‌ను ఆయన పొగిడారు.