కోల్కతా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘బుల్ బుల్’ తుపాను బారిన పడిన తమ రాష్ట్రానికి కేంద్రం చిల్లిగవ్వ కూడా విదిల్చలేదంటూ దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఆర్ధిక సాయం చేస్తామంటూ ట్విటర్లో ప్రధాని ప్రకటించారనీ... కానీ ఇప్పటి వరకు నిధుల విడుదల ఊసే లేదని ఆమె ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఇవాళ ఆమె మాట్లాడుతూ...
‘‘ బుల్ బుల్ తుపాను తర్వాత ఓ కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చి సర్వే చేసింది. అయినా ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఆర్ధిక సాయం అందలేదు. రాష్ట్రానికి రూ.23811.60 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రానికి సాయం చేస్తామంటూ ప్రధాని మోదీ ట్విటర్లో ప్రకటించారు. కానీ ఇంత వరకు నిధులు విడుదల చేయలేదు..’’ అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో బుల్ బుల్ తుపాను కారణంగా వాటిల్లిన నష్టంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మమత సమాధానం చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఆర్ధిక శాఖ నుంచి రూ.1200 కోట్లు విడుదల చేసినట్టు మమత వెల్లడించారు.