కోల్‌కతా: భారత టెస్టు క్రికెట్ చరిత్రలో చిరకాలం గుర్తుండిపోయే డే నైట్ టెస్టులో టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ మెరుపు శతకంతో చెలరేగాడు. ఇప్పటి వరకు వైట్, రెడ్ బంతులతో సెంచరీ కొట్టిన విరాట్ తాజాగా పింక్ బంతితోనూ మెరిశాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ గులాబీ టెస్టులోనూ తనదైన ముద్రవేశాడు. పింక్ బంతితో ఆడుతున్న తొలి టెస్టులోనే కింగ్ కోహ్లీ శతకం సాధించడం విశేషం. భారత్ తరఫున మైలురాయి అందుకున్న తొలి ప్లేయర్, కెప్టెన్ కోహ్లీనే. 159 బంతులాడిన విరాట్ 12 ఫోర్లతో 101 రన్స్ చేశాడు. టెస్టు కెరీర్లో విరాట్‌కిది 27వ శతకం కావడం విశేషం. 69 ఓవర్లు ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 4 వికెట్లకు 257 పరుగులు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 151 పరుగుల ముందంజలో ఉంది. కోహ్లీ(102), రవీంద్ర జడేజా(8) క్రీజులో ఉన్నారు.
ఓవర్ నైట్ స్కోరు 174/3తో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్‌కు రెండో రోజు కూడా మంచి శుభారంభం లభించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ రహానె కూడా అర్ధశతకం పూర్తి చేశాడు. టెస్టు కెరీర్లో అతనికిది 22వ అర్ధశతకం. హాఫ్‌సెంచరీ సాధించడం వరుసగా నాలుగోసారి కావడం విశేషం. వ్యక్తిగత స్కోరు 23 పరుగులతో రెండో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన రహానె హాఫ్‌సెంచరీ అనంతరం తైజుల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో కోహ్లీ, రహానె 99 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. భారత్ వేదికగా జరిగిన తొలి పింక్ బాల్ టెస్టులో వికెట్ దక్కించుకున్న తొలి స్పిన్నర్‌గా అరుదైన ఘనత అందుకున్నాడు.